ట్రైనెట్ న్యూస్ శశిమోహన కాంతి కిరణం....
..."స్వేచ్ఛ" ... మంచిదా చెడ్డదా..... పార్ట్.. 2
కొన్నిచోట్ల స్వేచ్ఛ అన్నది వ్యతిరేకమైన ఫలితాలను కూడా ఇస్తుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది మంచి, ఏది చెడు అన్న విషయం మీద బాగా ఆలోచిస్తారు. పరిస్థితులను బట్టి వారి పిల్లలు ఏం చదవాలో నిర్ణయిస్తారు. "ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు"తెలిసి తెలియని వయసులో ఉండే విద్యార్థికి కొన్ని విషయాలు ముందుగా తెలియాలి. ముందు తాను చదవగలనా లేనా అన్నది ఆలోచించాలి. కేవలం ఇష్టముంటే మాత్రం చాలదు. తానేంటో తన కెపాసిటీ ఎంతో తెలుసుకొని దాని ప్రకారం తను చదవబోయేదాన్ని నిర్ణయించుకోవాలి. యువతకు సాధారణంగా ఉడుకు రక్తం. ప్రతి దానికి ఆవేశం పనికిరాదు. వయసు ధైర్యం మాత్రమే ఉంటే సరిపోదు. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం కూడా కావాలి.ఆ జ్ఞానం అనుభవంతో కూడా వస్తుంది. దానికి పెద్దవారి ఇంగితం కూడా కావాలి. అందుకనే అన్ని నిర్ణయాలు తామే స్వతంత్రంగా తీసుకోకుండా పెద్దవారితో కూడా ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఎటువంటి హద్దులు లేనప్పుడు ఒక్కోసారి యువత వ్యసనాలకు బానిసై ,తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంటుంది.
స్వేచ్ఛ అనేది ఎంత మంచిదో హద్దులు లేకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. సమాజంలో ప్రతి వ్యక్తి నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అంటే వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. వ్యక్తిగత క్రమశిక్షణ లోపిస్తుంది. వారి విపరీత ధోరణి సామాజిక శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే పరిస్థితులకు దారితీస్తుంది.
అంతేకాదు స్వేచ్ఛగా వ్యవహరించాలి అనే వ్యక్తికి అతివాగుడు ధోరణి ఉంటే ,కులపరమైన ,మతపరమైన ఘర్షణలకు కూడా రెచ్చిపోయి దారి తీసే అవకాశం కూడా ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను అనే ధోరణి పెరిగితే ట్రాఫిక్ రూల్స్ ఉండవు, ప్రమాదాలు పెరుగుతాయి. అదుపు ఆజ్ఞలు లేని స్వేచ్ఛ సమాజాన్ని అడవిలో మారుస్తుంది. బలహీనులను బలవంతులు హింసించే అవకాశం ఇస్తుంది చట్టం న్యాయం అన్నవి మచ్చుకైనా కానరావు.
స్వేచ్ఛను మనం పరిమితంగానే వాడుకోవాలి. కోరికలను కూడా పరిమితం చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. అంతేకాదు ప్రతిదానికి మన చుట్టూ ఉన్న వాటిపై ఆధారపడటం కూడా సరైనది కాదు. మన ప్రతి చర్యకు నిర్ణయానికి బాధ్యత కూడా వహించాల్సి ఉంటుంది. అంతేకాదు అహంకారం ఈర్ష్య అన్న వాటిని అధిగమించటం కూడా అవసరం.
అందుకే స్వేచ్ఛ కావాలి కానీ దానికి హద్దులు కూడా కావాలి. మితిమించిన స్వేచ్ఛ పనికిరాదు.
శుభోదయం ...శశిబాల





