స్వరాళీ మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవం ఘనంగా
ఎస్పీ బాలు, ఎస్. జానకి పాటలతో సంగీత స్వరార్చన
విద్యార్థుల గాన, వాయిద్య ప్రదర్శనలకు ప్రముఖుల ప్రశంసలు
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 15: స్వరాళీ మ్యూజిక్ అకాడమీ 8వ వార్షికోత్సవం తెలంగాణ సరస్వత పరిషత్‌లో ఘనంగా జరిగింది. గాన గంధర్వుడు ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, గాన కోకిల ఎస్. జానకి సంగీత ప్రస్థానానికి అంకితంగా నిర్వహించిన ‘మ్యూజికల్ ట్రిబ్యూట్ టు లెజెండరీ వాయిసెస్’ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అకాడమీ విద్యార్థుల గాన, వాయిద్య ప్రదర్శనలతో పాటు చిన్నారుల కూచిపూడి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ వేడుకకు సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, సాయి మధుకర్, చిత్ర దర్శకుడు క్రాంతి వలాజా, గాయకులు పీవీఎన్‌ఎస్ రోహిత్, జీవీ శ్రీకీర్తి, ఎస్పీబీ కల్చరల్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు చెన్ను హరేరాము, గోవింద్ తదితరులు హాజరయ్యారు.
మాధవపెద్ది సురేష్ మాట్లాడుతూ, చిన్నారులు బాలు, జానకి పాటలను అద్భుతంగా ఆలపించారని ప్రశంసించారు. ప్రభాకర్ దమ్ము స్వరపరిచి ఆలపించిన నివాళి గీతం తనను భావోద్వేగానికి గురిచేసిందన్నారు. సాయి మధుకర్ మాట్లాడుతూ, సంగీతం పట్ల ప్రభాకర్‌కు ఉన్న అంకితభావం, క్రమశిక్షణ అభినందనీయమని, ఆయన వద్ద సంగీతం అభ్యసించడం విద్యార్థుల అదృష్టమని పేర్కొన్నారు.
దర్శకుడు క్రాంతి వలాజా మాట్లాడుతూ, ప్రభాకర్ గాత్రంలో బాలు మాధుర్యం, సాయి ప్రజ్వల గాత్రంలో చిత్ర మెలోడీ కనిపిస్తాయని కొనియాడారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో ఆప్యాయంగా మెలుగుతూ ప్రభాకర్ సంగీతాన్ని బోధిస్తారని తెలిపారు. తాను దర్శకత్వం వహించిన చిత్రానికి ఆయన అందించిన సంగీతాన్ని ప్రశంసించారు.
దిగ్గజ గాయకుల పట్ల అకాడమీ నిర్వాహకులు చూపుతున్న గౌరవం అభినందనీయమని చెన్ను హరేరాము, గోవింద్ పేర్కొన్నారు. గీత రచయిత సుధీర్ కుమార్ వరాల మాట్లాడుతూ, ప్రభాకర్‌తో తనకు 14 సంవత్సరాల సంగీత అనుబంధం ఉందన్నారు. ఆయన సంగీత దర్శకత్వంలో పలు పాటలకు సాహిత్యం అందించానని తెలిపారు. నివాళి గీతానికి ప్రభాకర్ సంగీతం, గానం, క్రాంతి వలాజా రూపొందించిన దృశ్యాలు చక్కగా సమకూరాయన్నారు.
అకాడమీ తరఫున పురస్కారాలు అందుకోవడం ఆనందంగా ఉందని పీవీఎన్‌ఎస్ రోహిత్, జీవీ శ్రీకీర్తి తెలిపారు. కార్యక్రమానికి విశేష సహాయ సహకారాలు అందించిన తిరుమల కృష్ణ చైతన్యకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మ్యూజిక్ ఇన్‌చార్జ్ యాద గౌడ్ సంగీత ప్రదర్శనల సమన్వయం, కార్యక్రమ నిర్వహణలో కృషి చేశారు. ఈ సందర్భంగా అతిథులు, కళాకారులు, సహకారదారులను అకాడమీ తరఫున సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
అకాడమీ వ్యవస్థాపకుడు, సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ము, సహ వ్యవస్థాపకురాలు సాయి ప్రజ్వల మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు దిగ్గజ కళాకారుల సంగీత వారసత్వాన్ని భావితరాలకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అతిథులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, కళాకారులు, సహకారదారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.





