* సీసీఎంబీ శాస్త్రవేత్తల వినూత్న పరిశోధన.. రెండు కొత్త సమ్మేళనాల గుర్తింపు..
* సంప్రదాయ యాంటీఫంగల్ మందుల ప్రభావం పెంచే అవకాశం.. ఎలుకలపై ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు..
సికింద్రాబాద్, నవంబర్ 17.. ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో సరికొత్త మార్గానికి హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు బాటలు వేశారు. వ్యాధులకు కారణమయ్యే ఫంగస్‌ను పూర్తిగా నాశనం చేయకుండా, దాని నుంచి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే లక్షణాలను మాత్రమే అడ్డుకునే వినూత్న విధానాన్ని కనుగొన్నారు. ఇందుకోసం రెండు కొత్త రసాయన సమ్మేళనాలను గుర్తించడం వైద్య పరిశోధనల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఫంగస్ ఆకృతి మార్పుపై పరిశోధన..
డాక్టర్ శ్రీరామ్ వరహన్ నేతృత్వంలోని బృందం క్యాండిడా అల్బికాన్స్ అనే ఫంగస్‌పై పరిశోధనలు నిర్వహించింది. సాధారణంగా శరీరంపై ఉండే ఈ సూక్ష్మజీవి, శరీరంలోని అంతర్గత భాగాల్లోకి ప్రవేశించినప్పుడు ప్రమాదకర ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. గుండ్రని కణాల నుంచి పొడవైన తంతువుల ఆకృతిలోకి మారడం ద్వారా వ్యాధి వ్యాప్తికి దోహదపడుతుంది. ఈ మార్పును నియంత్రించడంపై శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. చక్కెర జీవక్రియలో కీలకమైన పైరువేట్ కైనేజ్ ఎంజైమ్‌ను లక్ష్యంగా చేసుకుని రెండు సమ్మేళనాలను గుర్తించారు.
మందుల పనితీరు మెరుగుపడే అవకాశం..
ఈ సమ్మేళనాలు ఫంగస్ బయోఫిల్మ్ ఏర్పాటును తగ్గించడంతోపాటు ఫ్లూకోనజోల్, యాంఫోటెరిసిన్-బి ఔషధాల ప్రభావాన్ని పెంచినట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. ఎలుకలపై జరిపిన పరీక్షల్లోనూ చికిత్స పొందిన వాటి మనుగడ మెరుగుపడింది. ఈ పరిశోధన వివరాలు ఏసీఎస్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ధ్రుమి షా తొలి రచయితగా వ్యవహరించగా, బ్రిక్-ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు భాగస్వాములయ్యారు. అయితే, ఈ సమ్మేళనాలు ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయని, మనుషులపై వినియోగానికి ముందు మరిన్ని భద్రతా, సమర్థత పరీక్షలు అవసరమని పరిశోధకులు తెలిపారు.






