హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14:
శిఖరం ఆర్ట్ థియేటర్స్, శంకరం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ‘బాలల దినోత్సవం–సాంస్కృతిక వైభవం’ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియం ఈ కార్యక్రమానికి వేదికైంది. ముఖ్యఅతిథిగా తెలంగాణ శాసనమండలి సభ్యుడు ఎస్. మధుసూదనాచారి పాల్గొన్నారు. బాలబంధు డాక్టర్ ఎం.కె. రాము సభను ప్రారంభించగా, శ్రీ మహమ్మద్ షరీఫ్ సభాధ్యక్షత వహించారు. శంకరం ఫౌండేషన్ అధ్యక్షురాలు శ్రీమతి యలవర్తి ధనలక్ష్మి ఆత్మీయ అతిథిగా, రంగస్థల నటుడు దామోదరం సాంబందర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంగీత, నృత్య రంగాలకు చెందిన కళాకారులు, గురువులు పాల్గొన్నారు. శిఖరం ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపక కార్యదర్శి జి. కృష్ణ కార్యక్రమ నిర్వహణను సమన్వయం చేశారు.







