హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం శ్రీ త్యాగరాయ గానసభలో ‘చిల్డ్రన్స్ డే మెగా సెలబ్రేషన్’ నిర్వహించారు. చిన్నారులు రంగురంగుల వేషధారణలతో పాల్గొని తమ కళా ప్రతిభను ప్రదర్శించారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బాలబాలికలు నృత్య ప్రదర్శనలతో సందడి చేశారు. వేదికపై చిన్నారులకు జ్ఞాపికలు, పతకాలు అందజేసి ప్రోత్సహించారు. పురస్కారాలు అందుకున్న పిల్లలు నిర్వాహకులు, అతిథులతో కలిసి చిత్రాలు దిగారు.
కార్యక్రమంలో అతిథులను శాలువాలతో సత్కరించారు. చిన్నారుల కళా ప్రదర్శనలు, పురస్కారాల ప్రదానంతో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. బాలలు, తల్లిదండ్రులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






