ఘనంగా కత్తి కాంతారావు జాతీయ పురస్కార ప్రదానోత్సవం సినీ, టీవీ, మీడియా ప్రముఖులకు విశిష్ట పురస్కారాలు
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17:
నటుడిగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టి నష్టపోవద్దని అలనాటి ప్రముఖ నటుడు కత్తి కాంతారావు ఇచ్చిన సలహాను ఇప్పటికీ పాటిస్తున్నానని సినీ నటుడు సుమన్ అన్నారు. కళాప్రపూర్ణ కత్తి కాంతారావు జయంతిని పురస్కరించుకుని తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ‘కత్తి కాంతారావు జాతీయ పురస్కారం–2026’ ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుమన్‌కు పురస్కారాన్ని అందజేసి సత్కరించారు.
పురస్కారం స్వీకరించిన అనంతరం సుమన్ మాట్లాడుతూ.. కాంతారావుతో కొన్ని చిత్రాల్లోనే నటించినప్పటికీ, ఆయనతో జరిగిన సంభాషణలు తనకు ఎంతో విలువైనవని చెప్పారు. చిత్ర నిర్మాణంలో తాను ఎదుర్కొన్న నష్టాలను వివరించిన కాంతారావు, నటుడిగా మంచి పేరు సంపాదించుకోవడంపైనే దృష్టి పెట్టాలని సూచించారని గుర్తుచేసుకున్నారు. ఆయన మాటలను గౌరవించి ఇప్పటివరకు చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నానని తెలిపారు.
సినీ పరిశ్రమలో తన ప్రయాణానికి 48 ఏళ్లు పూర్తయ్యాయని సుమన్ పేర్కొన్నారు. దాదాపు వెయ్యి చిత్రాల్లో నటించానని, తెలుగులో సుమారు వంద చిత్రాల్లో కథానాయకుడిగా ప్రేక్షకులను అలరించానని చెప్పారు. తమిళ, కన్నడ ప్రేక్షకులు కూడా తనను ఆదరించారని తెలిపారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా నిజాయతీగా తన బాధ్యతలను నిర్వర్తించడానికే ప్రాధాన్యమిచ్చానన్నారు. తనకు లభించిన పురస్కార గౌరవాన్ని సుదీర్ఘకాలంగా అండగా నిలిచిన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
పురస్కార ఎంపిక కమిటీకి కేవీ రమణాచారి అధ్యక్షత వహించగా, విశ్రాంత ఐఏఎస్ అధికారి సి.పార్థసారథి, నాగబాల డి.సురేశ్‌కుమార్ సహాధ్యక్షులుగా వ్యవహరించారు. నాగబాల సురేశ్‌కుమార్ మాట్లాడుతూ.. 29 ఏళ్ల క్రితం స్థాపించిన భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరంతో కలిసి 24 ఏళ్లుగా కాంతారావు పేరిట ప్రముఖులను సత్కరిస్తోందని తెలిపారు. పౌరాణిక, సాంఘిక, యాక్షన్ పాత్రల్లో తనదైన ముద్రవేసిన సుమన్‌ను ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు.
హైదరాబాద్ సినిమా, టెలివిజన్ నిర్మాణాలకు ప్రధాన కేంద్రంగా ఎదిగిందని సి.పార్థసారథి అన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు తర్వాత తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్న కాంతారావు పేరిట సుమన్‌ను సత్కరించడం సముచితమన్నారు.
సుమన్‌ను తాను ఆప్యాయంగా ‘బంగారన్న’ అని పిలుస్తానని నటుడు బాబూమోహన్ చెప్పారు. నృత్యాలు, పోరాట సన్నివేశాల్లోనే కాకుండా వ్యక్తిత్వంలోనూ ఆయన ప్రత్యేకత కలిగినవారని ప్రశంసించారు. మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి మాట్లాడుతూ.. శ్రీరాముడు, వేంకటేశ్వరస్వామి పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన సుమన్, ‘శివాజీ’ చిత్రంలో ప్రతినాయకుడిగానూ ప్రతిభ చాటారని అన్నారు. టెలివిజన్ కళాకారులకూ ప్రభుత్వ పురస్కారాలు అందించే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఈ సందర్భంగా సినీ, టీవీ, మీడియా, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురికి ‘విశిష్ట కళా సామ్రాట్’, ‘విశిష్ట సేవా సామ్రాట్’ పురస్కారాలను అందజేశారు. సత్కారం పొందిన వారిలో మెట్రో డైలీ సంపాదకులు, ప్రచురణకర్త కాళిదాస్ దేవరకొండ, నటి కవిత, వకుళాభరణం కృష్ణమోహన్, ప్రైమ్ 9 టీవీ చైర్మన్ రఘువీర్, వీవీకే విజయ్‌కుమార్, న్యూస్‌రీడర్ విజయదుర్గ, నిర్మాత షరీఫ్ మహమ్మద్, న్యూస్ యాంకర్ స్వప్న, నటి జ్యోతిరెడ్డి, ఆర్జే ఆయుష్‌సింగ్, నృత్య దర్శకుడు జానీ మాస్టర్, డి.వెంకటరమణ, గాయత్రి భార్గవి, ఆకాంక్ష, వేణుమాధవ్, ఎన్.సత్యనారాయణ, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రామ్‌దాస్ నాయుడు, శశిబాల, గిడుగు క్రాంతికృష్ణ, దర్శకుడు చిత్తరంజన్‌దాస్, పి.ధనలక్ష్మి, నృత్యకారుడు రాజేశ్, నాట్యగురువు ఝాన్సీలక్ష్మి తదితరులు ఉన్నారు.






